హీరో సిద్ధార్థ్.. టాలీవుడ్ హీరోయిన్ అదితి రావు హైదరీని వివాహం చేసుకున్నారట. చాలా కాలంగా ప్రేమలో ఉన్న వీరు ఈరోజు పెద్దల సమక్షంలో ఏడడుగులు వేశారు.

వనపర్తిలోని శ్రీరంగపురం ఆలయంలో వీరి వివాహం జరిగిందని సమాచారం. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగినట్లుగా తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన పురోహితులు వీరి పెళ్లి తంతును సంప్రదాయబద్దంగా జరిపించారు.

వనపర్తి సంస్థానాధీశులు కట్టించిన ఆలయంలోనే సిద్ధార్థ్, అదితి వివాహం జరిగింది.అయితే వీరి పెళ్లికి సంబంధించి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అలాగే వీరి పెళ్లి ఫోటోస్ కూడా ఇంకా బయటకు రాలేదు. సిద్ధార్థ్, అదితి కలిసి మహా సముద్రం చిత్రంలో నటించారు. 2021లో విడుదలైన ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహించగా.. మరో హీరోగా శర్వానంద్ నటించారు. ఈ సినిమా చిత్రీకరణలో ఏర్పడిన పరిచయమే ఆ తర్వాత ప్రేమగా మారింది. అప్పటి నుంచి వీరి కలిసి ఈవెంట్స్, రెస్టారెంట్లలో కనిపించారు.

అలాగే గతంలో అదితికి బర్త్ డే విషెస్ తెలిపుతూ నా హృదయరాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు సిద్ధార్థ్. దీంతో అప్పటి నుంచి వీరి ప్రేమ విషయం బయటకు వచ్చింది. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధూకు పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. అదితిదేవో భవ అంటూ ఆన్సర్ ఇచ్చాడు సిద్ధార్థ్. దీంతో మరోసారి వీరి ప్రేమ రూమర్స్ కు బలం చేకూరింది. సిద్ధార్థ్‏కు ఇది రెండో వివాహం. తన చిన్ననాటి స్నేహితురాలు మేఘనను పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్.. 2007లో ఆమెకు విడాకులు ఇచ్చాడు.

అప్పటినుంచి సిద్ధార్థ్ ఒంటరిగానే ఉంటున్నాడు. అలాగే అదితికి కూడా ఇది సెకండ్ మ్యారెజ్. గతంలో సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకుంది. అతడికి 2012లో విడాకులు తీసుకుంది. తెలుగులో వి, సమ్మోహనం, అంతరిక్షం వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె సంజాయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి సినిమాలో నటిస్తుంది.