కోవిడ్-19 సెకండ్ వేవ్ వ్యాప్తి మొదలైన తర్వాత.. వైరస్ బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అంతేగాక.. ఆక్సిజన్‌కు కూడా డిమాండ్ పెరిగింది. ఇప్పుడు దేశమంతా ప్రాణవాయువు కోసం పరితపిస్తోంది. ఈ సారి కరోనా చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. లక్షణాలు గుర్తించేలోపే ఊపిరితీత్తుల్లో తిష్ట వేస్తోంది. ఇది గుర్తించేలోపే నష్టం జరిగిపోతోంది. దీంతో బాధితులకు అత్యవసరంగా ఆక్సిజన్ అందించాల్సి వస్తోంది. వైరస్ వల్ల బాధితుల్లో ఆక్సిజన్ సమస్య ఎందుకు ఏర్పడుతోంది? శరీరంలో ఆక్సిజన్ తగ్గిందో లేదో ఎలా తెలుస్తుంది? ఎలా గుర్తించాలి? తదితర విషయాలను ఇప్పుడు చూద్దాం.

ఆక్సిజన్ సమస్య ఎందుకు వస్తుంది?: కరోనా వైరస్ శరీరానికి అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటైన ఊపిరితీత్తుల్లో తిష్ట వేస్తుందనే సంగతి తెలిసిందే. మొదట్లో వైరస్ సోకిన 5 రోజుల్లో లక్షణాలు కనిపించేవి. కానీ, ఇప్పుడు ముదిరిన తర్వాతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా టెస్టుల్లో నెగటివ్ వచ్చినవారు తమలో వైరస్ లేదని భావించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం లేదు. ఫలితంగా వైరస్ నెమ్మదిగా ఊపిరితీత్తుల్లో విస్తరించి.. అకస్మాత్తుగా దాడి చేస్తోంది. దీన్ని కేవలం సిటీ స్కాన్ ద్వారా మాత్రమే గుర్తించగలుగుతున్నారు. అందుకే, టెస్టుల్లో మీకు నెగటివ్ వచ్చినా.. వైద్యుల సూచనతో సిటీస్కాన్ కూడా తీయించుకుని జాగ్రత్తగా ఉండటం ఉత్తమం.

కరోనా వస్తే ఏం జరుగుతుంది?: కోవిడ్-19 ఊపిరితీత్తుల్లోకి వెళ్లి.. తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటుంది. ఈ సందర్భంగా అది ఊపిరితీత్తులు ఆక్సిజన్ గ్రహించే శక్తిని అడ్డుకుంటుంది. ఆక్సిజన్ ఉత్పత్తిని అడ్డుకోవడమే కాకుండా.. ఊపిరితీత్తులకు రక్తాన్ని అందించే నాళాలను గడ్డకట్టిస్తుంది. ఫలితంగా శరీరంలోని ఇతర భాగాలకు ఆక్సిజన్ సరఫరా కాదు. ఇది క్రమేనా న్యుమోనియాకు దారి తీస్తుంది. ఫలితంగా రక్తంలోనూ ఆక్సిజన్ శాతం తగ్గుతుంది. ఆక్సిమీటర్ ద్వారా ఈ మార్పును గుర్తించవచ్చు. ఆక్సిజన్ శాతం 94 నుంచి 90 మధ్యన చూపిస్తుంటే శరీరానికి అదనంగా ఆక్సిజన్ అవసరమని అర్థం. ఆ సమయంలో శరీరానికి ఎంత ఆక్సిజన్ అవసరమనేది కేవలం వైద్యులకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి.. ఆస్పత్రిలో వైద్యుల సమక్షంలోనే ఆక్సిజన్ తీసుకోవాలి. లేకపోతే కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. బాధితుడు తిరిగి తనంతట తానే ఊపిరి పీల్చుకొనే వరకు ఆక్సిజన్ అవసరమవుతుంది. కాబట్టి.. మీరు శరీరంలో ఆక్సిజన్ శాతం మీద నిఘా పెట్టండి. అది ఎప్పుడు తగ్గుతున్నట్లు అనిపిస్తున్నా వెంటనే వైద్యులను సంప్రదించండి.