మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ అని వ్యవహరిస్తారు. డయాబెటిస్ అని కూడా అనబడే ఈ వ్యాధి, ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం,

రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత .అతిమూత్రం (పాలీయూరియా), దాహం ఎక్కువగా వేయడం , మందగించిన చూపు, కారణం లేకుండా బరువు తగ్గడం, బద్ధకం దీని ముఖ్య లక్షణాలు. మధుమేహం లేదా చక్కెర వ్యాధిని సాధారణంగా రక్తంలో మితి మీరిన చక్కెర స్థాయిని బట్టి గుర్తిస్తారు.

మధుమేహ రోగుల్లో రక్తంలో చక్కెరల నియంత్రణకు దాల్చినచెక్క బాగా ఉపయోగపడుతోందని కాలిఫోర్నియాలోని వెస్టర్న్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది.పరిశోధనలో భాగంగా.. 543 మంది టైప్2 మధుమేహ రోగుల్లో కొంతమందికి దాల్చినచెక్కను రోజుకు 120 మిల్లీగ్రాముల నుంచి 6 గ్రాముల వరకూ మాత్రల రూపంలో ఇచ్చారు.

మరికొంత మందికి నకిలీ మాత్రలు ఇచ్చారు. తర్వాత ఫలితాలను పరిశీలించగా..దాల్చిన చెక్క మాత్రలు తీసుకున్నవారి రక్తంలో చక్కెరల స్థాయి మిగతావారికన్నా మెరుగ్గా నియంత్రణలో ఉన్నట్లు తేలింది. ఇన్సులిన్ హార్మోన్ విడుదల, పనితీరును దాల్చినచెక్క ప్రభావితం చేయడం వల్లే చక్కెరల స్థాయి మెరుగుపడుతున్నట్లు గుర్తించారు. అలాగే చెడు కొలెస్ట్రాల్(ఎల్‌డీఎల్)ను, ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంతోపాటు మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను పెంచడంలో కూడా దాల్చినచెక్క దోహదపడినట్లు గమనించారు. అయితే మధుమేహ రోగులకు కచ్చితంగా ఎంత మోతాదు దాల్చినచెక్కను ఇవ్వాలన్న దానిని ఇంకా నిర్ధారించాల్సి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు