వేస‌వి కాలంలో మ‌న‌కు స‌హ‌జంగానే మామిడి పండ్లు అధికంగా ల‌భిస్తుంటాయి. ఎందుకంటే ఇది సీజ‌న్ కాబ‌ట్టి, ఈ సీజన్‌లోనే మ‌నం మామిడి పండ్ల‌ను అధికంగా తిన‌గలం.

అలాగే వాటితో చాలా మంది ప‌చ్చ‌డి, ఒరుగులు, తాండ్ర వంటివి చేసి నిల్వ చేస్తుంటారు. అయితే ఈ సీజ‌న్‌లోనే మ‌న‌కు ల‌భించే వాటిల్లో చింత చిగురు కూడా ఒక‌టి. ఇప్పుడు మ‌న‌కు ర‌హ‌దారుల ప‌క్క‌న చింత చెట్ల‌కు ఎక్క‌డ చూసినా చింత చిగురు క‌నిపిస్తోంది.

అలాగే మార్కెట్ల‌లో చింత చిగురును విక్ర‌యిస్తున్నారు కూడా. ఈ క్ర‌మంలోనే చింత చిగురుతో మ‌నం అనేక ర‌కాల వంట‌కాల‌ను చేస్తుంటాం. చింత చిగురు ప‌ప్పు, ప‌చ్చడితోపాటు పులిహోర‌, రొయ్య‌లు, మ‌ట‌న్‌, చికెన్ వంటివి క‌లిపి వండుతుంటారు.

అయితే వాస్త‌వానికి చింత చిగురు చ‌క్క‌ని రుచిని అందించ‌డ‌మే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ క్ర‌మంలో చింత చిగురును తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. చింత చిగురులో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల ఇది ఆర్థ‌రైటిస్ ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు చేస్తుంది.

చింత చిగురును నేరుగా తిన్నా లేదా పేస్ట్‌లా చేసి క‌ట్టులా క‌డుతున్నా కీళ్ల నొప్పులు, వాపులు త‌గ్గుతాయి. మోకాళ్ల నొప్పుల నుంచి కూడా ఉప‌శ‌మనం ల‌భిస్తుంది. ఇక దీన్ని తిన‌డం వ‌ల్ల విట‌మిన్ ల‌భిస్తుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని స‌హ‌జ‌సిద్ధంగా పెంచుతుంది. దీంతో వాతావ‌రణం మార్పుల వ‌ల్ల వ‌చ్చే సీజ‌న‌ల్ వ్యాధుల‌కు అడ్డుక‌ట్ట వేయ‌వచ్చు. అలాగే చింత చిగురు ఆకుల పేస్ట్‌ను రాయ‌డం వ‌ల్ల గాయాలు, పుండ్లు త్వ‌ర‌గా మానుతాయి.

ఇది యాంటీ సెప్టిక్‌లా ప‌నిచేస్తుంది. అలాగే చ‌ర్మ ఇన్‌ఫెక్షన్లు కూడా త‌గ్గుతాయి. ద‌గ్గు, జ‌లుబు, గొంతు స‌మ‌స్య‌ల‌కు సైతం చింత చిగురు చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని అందులో కొన్ని చింత చిగురు ఆకులను వేసి కాసేపు మ‌రిగించాలి. అనంతరం చ‌ల్లార్చి గోరు వెచ్చ‌గా ఉండ‌గానే అందులో తేనె క‌లిపి తాగాలి. దీంతో ద‌గ్గు, జ‌లుబు, గొంతు నొప్పి త‌గ్గుతాయి. ఇక చింత చిగురు ఆకుల ర‌సాన్ని సేవించ‌డం వ‌ల్ల మ‌హిళ‌ల‌కు రుతు స‌మ‌యంలో వ‌చ్చే నొప్పులు త‌గ్గుతాయి. ఇలా చింత చిగురు మ‌న‌కు చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. క‌నుక ఇది బ‌య‌ట ఎక్క‌డైనా క‌నిపిస్తే విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు.