ప్రపంచ దిగ్గజ సంస్థలు గూగుల్, ఆల్ఫాబెట్ లకు సీఈవోగా వ్యవహరిస్తున్న సుందర్ పిచాయ్ తాను సంస్థలో చేరి 20 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

2004లో గూగుల్ లో ప్రోడక్ట్ మేనేజర్ గా చేరినప్పటి నుంచి తన ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. ఉద్యోగంలో చేరిన తొలి రోజు నుంచి ఇప్పటివరకు తన 20 ఏళ్ల సర్వీసులో సంస్థలో ఎన్నో మార్పులు జరిగాయని పేర్కొన్నారు.

ఈ మేరకు తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. 2004 ఏప్రిల్ 26.. గూగుల్ లో నా తొలి రోజు. అప్పటినుంచి ఇప్పటివరకూ సంస్థ ఎంతో మారింది. సాంకేతికత, మా ఉత్పత్తులు ఉపయోగించే ప్రజల సంఖ్యతో పాటు, నా జుట్టు కూడా మారిపోయింది. కానీ ఈ గొప్ప కంపెనీలో పని చేస్తుంటే నాకు కలిగే ఉత్సాహం మాత్రం మారలేదు. 20 ఏళ్లు గడిచిపోయాయి..

నన్ను నేను ఎంతో అదృష్టవంతుడిగా భావిస్తున్నా అంటూ సుందర్ పిచాయ్ తన ఇన్ స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేశారు. 20 అంకె ఆకారంలో ఉన్న రెండు బెలూన్లు, లావా విరజిమ్ముతున్నట్లుగా దీపం ఆకారంలోని జ్ఞాపిక, తన తొలి, ప్రస్తుత ఐడీ కార్డుల ఫొటోలను తన పోస్టుకు జత చేశారు. ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అయింది.