నోటిపూత వచ్చిందంటే చాలు వేడిగా లేదా కారంగా ఏమైనా తినాలంటే చాలా భయం. నోటిపూతకి చాలా కారణాలు ఉన్నా విటమిన్ బి కాంప్లెక్స్ లోపం,విటమిన్ బి12, జింక్ లోపం వలన అదేవిధంగా ఒక రకమైన వైరస్ వలన బాక్టీరియా ఇన్ఫెక్షన్ వలన కడుపులో పురుగులు ఉండడంవలన దీర్ఘకాలిక అనారోగ్యం, మానసిక ఒత్తిడి ఆహారం సరిగ్గా జీర్ణంకాకపోవడం ఏదైనా వ్యాధికి ఇంగ్లీషు మందులు వాడడంవలన ఇలా అనేక కారణాలు వలన కూడా నోటిపూత ఎక్కువగా వస్తుంది. ఎండాకాలం ఒంట్లో అధికవేడి వలన కూడా తరుచు నోటి పూతలు వస్తాయి. నోటి పూతంటే నాలుక ఎర్రగా మారడం, నాలుక కింద పుండ్లు, బుగ్గలలోపల పుండ్లు ఏర్పడతాయి.

ఇవి విపరీతంగా నొప్పి కలిగిస్తాయి. దీనిమూలంగా గవదబిల్లలు, తలనొప్పి జ్వరం కూడా వస్తాయి. దీనికి మందులు అందుబాటులో ఉన్నా సహజ నాచురల్ పద్థతిలో ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. నోటిపూత నోరు శుభ్రంగా లేకపోవడం వలన కూడా వస్తుంది. నోటిపూతకి వెల్లుల్లి చాలా బాగా పనిచేస్తుంది. సహజసిద్ధమైన యాంటిబయాటిక్ గుణాలు వెల్లుల్లిలో ఎక్కువగా ఉండడం వలన నోటిపూత త్వరగా తగ్గిపోతుంది. రెండు రెబ్బలను దంచి ఆ రసం రాస్తే నోటిపూత తగ్గుతుంది. ఇలా రోజుకి నాలుగు సార్లు చేస్తుంటే నోటిపూత తగ్గిపోతుంది. బియ్యం కడిగిన నీళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తాయి. బియ్యం కడిగిన నీరులో పటికబెల్లం పొడి కలిపి ముప్ఫై గ్రాములు రోజుకి రెండు సార్లు తాగితే నోటిపూత పోతుంది.

జాజికాయ పొడిని పాలలో కలిపి గంధంలా రెండు రోజులు నోరంతా పూసినా నోటిపూత తగ్గుతుంది. స్వచ్ఛమైన ఆవునెయ్యి కూడా నోటిపూతని తగ్గిస్తుంది. కొత్తిమీర కషాయం పుక్కిలించడం వలన కూడా నోటిపూత తగ్గుతుంది. గోరువెచ్చని నీటిలో ఉప్పువేసి నోరు పుక్కిలిస్తే నోటి పుండ్లు త్వరగా మానతాయి. కొబ్బరినూనె లో సహజసిద్ధమైన యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. స్వచ్ఛమైన కొబ్బరినూనె పుండ్లపై అప్లై చేసిన నోటిపూత, నోటిలో పుండ్లు తగ్గుతాయి.

ధనియాలు, లేదా ఉసిరికాయ తినడం వలన దానిలో ఉండే పోషకాలు , విటమిన్ సి నోటిపూత తగ్గే‌లా చేస్తాయి. తరుచూ స్పూన్ ఉసిరి రసాన్ని నీటిలో కలిపి తాగడం వలన ఎప్పటికీ నోటిపూత రాదు. మెంతులను నీటిలో నానబెట్టి ఆ నీటిని వేడిచేసి ఆ నీటితో నోటిని పుక్కిలించినా నోటిపూత తగ్గొచ్చు. సన్నజాజి ఆకులు నమిలి ఆ రసాన్ని పుక్కిలించినా నోటిపూతకి అద్బుతంగా పనిచేస్తుంది. నోటిపూత ఉన్నప్పుడు మసాలా లేదా వేడ చేసే పదార్థాలు తినకూడదు.