‘ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ.. జాగ్రత్తగా వాహనాలు నడపండి’ అంటూ ట్రాఫిక్ పోలీసులు మొత్తుకుంటున్న కొందరు వాహనదారులు చెవికెక్కించుకోవడం లేదు. పైగా అతి తెలివికి పోయి బండి నంబర్ కన్పించకుండా వివధ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా సరే అలాంటి వారికి ట్రాఫిక్ తగిన రీతిలో షాకిస్తున్నారు.

తాజాగా ఓ వాహదారునికి దిమ్మతిరిగే షాకిచ్చిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆ ఫోటోని సెటైర్ వేస్తూ మరీ ట్విట్ చేశారు. ‘చలానాలు పడకుండా ఉండాలంటే ట్రాఫిక్ నియమాలు పాటించడం ఒకటే ఉత్తమ మార్గం.. విన్యాసాలు చేసి తప్పించుకోవడం కాదు’ అని హితబోధ చేశారు. బైక్ మీద ముగ్గురు వెళ్తూ ట్రాఫిక్ పోలీసుల కంట పడ్డారు. అయితే బండి నెంబర్ ప్లేట్ కన్పించకుండా వెనక కూర్చున్న యువతి తన కాలు అడ్డుపెట్టింది. ప్చ్.. కానీ పూర్తిగా కవర్ చేయలేకపోయింది. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన వాహనంతోపాటు ఆ యువతికి తగిన గుణపాఠం చెప్పాలని ట్రాఫిక్ పోలీసులు భావించారు.

ట్రిపుల్ రైడింగ్‌కు రూ.1200, వెనుక కూర్చున్న వ్యక్తికి హెల్మెట్ లేకపోతే మరో రూ.100 మాత్రమే జరిమానా విధించాల్సిన చోటా.. వాహనం సమాచారం కనిపించకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నందుకు మరో రూ.500, డేంజరస్ డ్రైవింగ్‌ చేసినందుకు రూ.1000 ఇలా అదనంగా రూ.1500 జరిమానా విధించి వారి తిక్క కుదిర్చారు. పైగా ‘అత్తారింటికి దారేది’ సినిమా క్లయిమాక్స్ లో పవన్, నదియా మధ్య వచ్చే సీన్‌తో మీమ్ క్రియేట్ చేసి మరీ వారిపై సెటైర్ వేస్తూ ట్వీట్ చేశారు. ‘నువ్వేమో రూ.1300లు కాపాడదామని కాలు పెట్టావ్.. కానీ నువ్వు చేసిన పనికి ఇంకో రూ.1500 ఎక్కువ పడ్డాయి’ అని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేసిన మీమ్ అందరినీ ఆలోచింపజేస్తోంది. దీన్ని నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. కొందరేమో తిక్క కుదిరింది అంటుండగా.. మరి కొందరేమో ఫన్నీ కామెంట్లు జోడిస్తున్నారు.