జిమ్ చేస్తున్నప్పుడు, నిద్రలో వున్నప్పుడు, ఇతర పనులు చేస్తున్నప్పుడు హార్ట్ ఎటాక్ వచ్చిన సందర్భాలు కోకొల్లలు. ఛాతీలో నొప్పి రావడంతోపాటు అజీర్ణం వంటి సమస్యలు ఎదురవుతాయి.

ఆహారం సరిగా తీసుకోకపోవడం, ఒకేచోట ఎక్కువ సేపు కూర్చోవడంలాంటివి గుండెపోటుకు కారణాలయ్యే అవకాశం ఉంది. అయితే అలుపు, ఆయాసం, ఊపిరి అందకపోవడం, పని చేసుకోలేకపోవడం, కారణం లేకుండా బరువు తగ్గడం, అరికాళ్లలో చెమటలు వంటి లక్షణాలు కొద్ది రోజులుగా లేదా వారాలుగా కన్పిస్తే..

గుండె జబ్బు ఉన్నట్టే అంటున్నారు వైద్య నిపుణులు. ఈ లక్షణాలు కన్పించినా, చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ఏ క్షణమైనా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. శరీరంలోని భాగాలకు రక్తాన్ని సరఫరా చేయడంలో ఏర్పడిన అడ్డంకే గుండెపోటుకు దారితీస్తుంది.

రక్తాన్ని సరఫరా చేసే ధమని బ్లాక్‌ కావడంతో ఈ పరిస్థితి వస్తుంది. తినే ఆహారంలో కొవ్వులు తక్కువగా ఉండాలి. మాంసం, పాల పదార్థాలను మితంగా తీసుకోవాలి. ఫైబర్‌ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లను తినాలి.పొటాషియం ఎక్కువగా ఉండే టమాట, వేరుశనగ, అరటి పండ్లు ఆహారంలో ఉండేలా చూడాలి.

ఉప్పు తక్కువగా వాడాలి, సిగరెట్లు, బీడీలు, మద్యపానం గుండెపోటు ముప్పును 70 శాతం అధికం చేస్తుంది. వ్యాయామాలతో గుండె జబ్బును దరి చేరనీయకుండా చేయొచ్చు. హృద్రోగం ముందస్తు లక్షణాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి. అవి పంపే డేంజర్‌ బెల్స్‌కు స్పందించాలి. అప్పుడే దేశంలో సంభవిస్తున్న ఈ హఠాత్తు గుండెపోటు మరణాలను మనం 90 శాతం వరకు నిరోధించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.