ఆల్కహాల్ దుష్ప్రభావాలు ప్రతి వ్యక్తి, వారి ఆరోగ్య సమస్యలపై ఆధారపడి ఉంటాయి. పరిమితికి మించి మందు తాగడం శరీరానికి కచ్చితంగా వినాశకరంగా మారుతుంది.

ఈ అలవాటు కోలుకోలేని అనారోగ్యాలు, వ్యాధులకు కారణం అవుతుంది. ఆల్కహాల్ ఎక్కువగా తాగడం వల్ల కాలేయం, కడుపు, గుండె, మెదడు, నాడీ వ్యవస్థకు తీవ్రమైన హాని కలుగుతుంది. ఇది నోరు, గొంతు, స్వరపేటిక, అన్నవాహిక క్యాన్సర్ ప్రమాదాన్ని సైతం పెంచుతుంది.

బాగా తాగే వ్యక్తులు సరిగా తినకపోవచ్చు, ఫలితంగా వారు విటమిన్, ఖనిజాల లోపం బారిన పడి ఇమ్యూనిటీ దెబ్బతినొచ్చు. మద్యం ప్రాణాంతకంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎక్కువగా మందు తాగితే ఆల్కహాల్ పాయిజనింగ్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

పరిమితికి మించి తాగినప్పుడు, వారు ఆల్కహాల్ పాయిజనింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. తక్కువ సమయంలో ఎక్కువ మందు తాగే బ్రింజ్ డ్రింకింగ్ పరిస్థితి ఇందుకు దారితీయవచ్చు.మానవ కాలేయం 20 గ్రాముల కంటే తక్కువ ఆల్కహాల్‌ను మాత్రమే మెటబలైజ్ చేయగలదని అధ్యయనాలు చెబుతున్నాయి.

విస్కీ వంటి డిస్టిల్డ్ స్పిరిట్స్ సాధారణంగా 40 శాతం ఆల్కహాల్ కలిగి ఉంటాయి. బీర్ ఆల్కహాల్ పర్సెంటేజ్ 3-8 శాతం వరకు ఉంటుంది. వైన్‌లో ఇది 10 శాతం ఉంటుంది. ఇలాంటి డ్రింక్స్ కొంత సమయంలోనే భారీగా తాగితే.. ఆల్కహాల్ పాయిజనింగ్ ఏర్పడి ప్రాణాలు పోవచ్చు.