మనిషి ఆరోగ్యానికి మంచి ఆహారంతోపాటు తగినంత నిద్రకూడా అవసరం. ఇటీవల కాలంలో నిద్రలేమితో ఎంతోమంది సతమతమవుతున్నారు. ఇది గుండె జబ్బులకు దారితీస్తుందంటున్నారు నిపుణులు.

ఇలాంటి సమస్యలకు మన వంటింట్లో ఉంటే చిన్న ఔషధంతో చెక్‌ పెట్టవచ్చంటున్నారు. అదే గసగసాలు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గసగసాలు చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటాయి.

అందువల్ల వేసవిలో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అద్భుత ఔషధ గుణాలు కలిగిన గసగసాలు తినటం ద్వారా పీచు, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, విటమిన్లు B6, E సమృద్ధిగా లభిస్తాయి. నాడీ వ్యాధులు, మధుమేహం, గుండె జబ్బులు వంటి వివిధ రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో గసగసాలు ఎంతగానో ఉపయోగపడతాయి.

గసగసాలు తినడం వల్ల పొట్టకు చల్లదనం చేకూరుతుంది.ఇది ఎసిడిటీ, మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. శరీరంలో రక్తం కొరత తీరుతుంది. ఎముకలను దృఢంగా చేస్తాయి. మెదడుకు నరాల, రక్త కణాల ప్రవాహాన్ని నియంత్రించే సామర్థ్యం గసగసాలకు ఉంది.

మెదడులోని నాడీ కణాలు ఉత్తేజితం కావడం వల్ల మెదడు సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి పాలలో ఉడకబెట్టిన గసగసాలు తింటే పిల్లల్లో జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. పెద్దలు గసగసాల పాలను తాగితే మంచిది. గసగసాలలో కాల్షియం, కాపర్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు పోషకాలు ఎముకల ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనవి.